Bigg Boss 6 Telugu Episode 43: మార్చిపడదొబ్బుతా అన్నావ్.. ఏమైంది.. వెళ్తూ వెళ్తూ రేవంత్‌ గాలి తీసేసిన సుదీప

Share This :

అందరూ ఊహించినట్టుగానే ‘పింకీ’ సుదీప బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వచ్చిన సుదీప్.. ‘నేను రెండు వారాల్లో బయటికి వచ్చేస్తానని మా ఆయన అన్నాడు. కానీ, ఆరు వారాలు ఉన్నాను. చాలా హ్యాపీగా ఉంది’ అని నాగార్జునతో చెప్పారు. అలాగే, హౌస్ సుదీప జర్నీని ఆమెకు మన టీవీలో వేసి చూపించారు నాగార్జున. ఈ జర్నీలో రేవంత్‌తో సుదీప ఫైట్ బాగా హైలైట్ అయ్యింది. ఆ తరవాత నాగార్జున సుదీపకు ఇచ్చిన టాస్క్‌లో రేవంత్‌నే టార్గెట్ చేస్తూ మాట్లాడారు సుదీప.

‘బిగ్ బాస్’ సీజన్ 6 నుంచి ‘పింకీ’ సుదీప ఎలిమినేట్ అయ్యారు. నిజానికి ఈమె ఎలిమినేట్ అయినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే, ఆ ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా జరిగింది.. హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత లోపల ఉన్నవారిపై సుదీప్ ఏం కామెంట్స్ చేశారు అనేది ఆసక్తికరం. అందుకే, ఎలిమినేషన్ ప్రక్రియ, సండే జరిగిన ఫన్‌తో ఎపిసోడ్ 43 హైలైట్స్ మీకోసం..

RRRలో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చారు నాగార్జున. అస్సలు ఆలస్యం చేయకుండా మన టీవీ ద్వారా హౌస్‌మేట్స్‌ను పలకరించారు. గీతూను కాసేపు ఆడుకున్నారు. ఆ తరవాత రేవంత్ స్టోర్ రూమ్‌కు వెళ్లు అని నాగార్జున చెప్పగానే.. గీతూ అందకుని ‘సార్, రేవంత్‌కి కాలు బాగాలేదు, ఈసారి ఎవరినైనా పంపండి సార్’ అంది. ఎవరో ఎందుకు నువ్వే వెళ్లు అని ఆమెకే పని చెప్పారు. గీతూ చాలా బద్ధకంగా లేచి నడుస్తుంటే వయసొచ్చిన చిరుతలా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. దీనికి.. ‘వయసు అయిపోయిన చిరుత’ అంటూ బాలాదిత్య పంచ్ వేశాడు.

స్టోర్ రూమ్ నుంచి వచ్చిన క్లోజ్డ్ బోర్డ్స్‌తో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేషన్స్‌లో ఉన్న రాజ్, సుదీప, బాలాదిత్య, గీతూ, మరీనా, శ్రీహాన్, ఆదిరెడ్డి, కీర్తికి బోర్డులు ఇచ్చారు. ఒక్కొక్కరు బోర్డును ఓపెన్ చేస్తే సేఫ్ అని వచ్చినవాళ్లు సేవ్ అయినట్టు. ఈ ప్రక్రియలో ఆదిరెడ్డి సేఫ్ అయ్యారు. ఇక ఆ తరవాత ‘బొమ్మలతో పాట’ అనే ఆటను హౌస్‌మేట్స్‌తో నాగార్జున ఆడించారు. హౌస్‌మేట్స్‌ను రెండు టీమ్‌లుగా విడదీసి.. వాళ్ల మధ్యలో ఒక బజర్ ఏర్పాటుచేసి టీవీ స్క్రీన్‌పై బొమ్మలు, అంకెలు చూపించారు. వాటితో పాటను గెస్ చేసి పాడాలి. బజర్ ఎవరు ముందుగా నొక్కితే వాళ్లు పాట పాడాలి. ఈ ఆట మంచి రంజుగా సాగింది.

ఈ ఆట సాగుతున్న మధ్యలోనే మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియను తీసుకొచ్చారు నాగార్జున. స్టోర్ రూమ్‌లో ఉన్న టెలిఫోన్‌ను గీతూతో తెప్పించారు. నామినేషన్స్‌లో ఉన్న రాజ్, సుదీప, బాలాదిత్య, గీతూ, మరీనా, శ్రీహాన్, కీర్తి ఒక్కక్కరూ ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఎవరికి హలో అని వినిపిస్తుందో వారు సేఫ్. ఈ ప్రక్రియలో శ్రీహాన్ సేఫ్ అయ్యాడు. ఆ తరవాత మళ్లీ ‘బొమ్మలతో పాట’ మొదలైంది. చివరికి ఈ గేమ్‌లో శ్రీసత్య టీమ్ గెలిచింది. ఆ తరవాత మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది. ఈసారి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురికి ఐదు చిన్న సంచులు ఇచ్చారు. వాటిలో యాపిల్స్ ఉన్నాయి. ఒక్కొక్కరు సంచి ఓపెన్ చేయాలి. గ్రీన్ యాపిల్ వస్తే సేఫ్.. రెడ్ యాపిల్ వస్తే అన్‌సేఫ్. ఈ ప్రక్రియలో కీర్తి, రాజ్ సేఫ్ అయ్యారు.

అనంతరం హౌస్‌మేట్స్‌తో మరో గేమ్ ఆడించారు నాగ్. ఈసారి హౌస్‌మేట్స్‌కు సినిమా డైలాగులు రాసి ఉన్న బోర్డులు పెట్టారు. ఆ బోర్డు ఎవరికి సూటైతో వారి మెడలో వేయాలని సూచించారు. ఈ గేమ్ మధ్యలో మళ్లీ ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. నామినేషన్స్‌లో ఉన్న నలుగురికి నాలుగు వాటర్ బాటిల్స్ ఇచ్చారు. అందులో లిక్విడ్ ఉంది. ఆ లిక్విడ్‌ను గ్లాసుల్లో పోయాలి. ఎవరి లిక్విడ్ గ్రీన్ వస్తే వాళ్లు సేఫ్. ఈ ప్రక్రియలో మరీనా సేఫ్ అయ్యారు. ఆ తరవాత మళ్లీ బోర్డు గేమ్ మొదలైంది. ఈ గేమ్ పూర్తయ్యాక జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో నామినేషన్‌లో ఉన్న ముగ్గురికి మూడు పూల కుండీలు ఇచ్చారు. అందులో మట్టి కూడా ఉంది. వాటిలో నుంచి కోస్టర్‌ను తీయాలి. వాటిపై సేఫ్ ఉంటే వాళ్లు సేవ్ అయినట్టే. ఈ ప్రక్రియలో గీతూ సేఫ్ అయ్యింది. ఇక మిగిలిన ఇద్దరు బాలాదిత్య, సుదీపకు చివరిగా రెండు బ్యాటరీలు ఇచ్చారు. వాటిలో ఎవరి బ్యాటరీ చార్జింగ్ ఎక్కువగా ఉంటే వాళ్లు సేఫ్. సుదీప బ్యాటరీ చార్జింగ్ తక్కువగా ఉంది ఆమె ఎలిమినేట్ అయ్యింది.

సుదీప ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించగానే బాలాదిత్య, మరీనా కంటతడి పెట్టుకున్నారు. అయితే, చలాకీ చంటి వెళ్లినప్పుడు కనిపించినంత హడావుడి సుదీప వెళ్లినప్పుడు కనిపించలేదు. నవ్వుతూనే సుదీప బయటికి వచ్చేశారు. ఆమెకు వెల్‌కమ్ చెప్పిన నాగార్జున.. మన టీవీలో ఆమె జర్నీని చూపించారు. ఆ తరవాత ఒక తోపుడు బండిపై కూరగాయలు పెట్టి, వాటి లక్షణాన్ని తగ్గట్టు పేర్లు పెట్టి అవి ఎవరికి సూటవుతాయో చెప్పమన్నారు. ఈ క్రమంలో మిరపకాయకి షార్ప్ టంగ్ అని రాసుంటే దాన్ని రేవంత్‌కు ఇచ్చారు సుదీప. గతంలో హౌస్‌లో కిచెన్ దగ్గర రేవంత్‌తో సుదీప గొడవపడిన విషయం తెలిసిందే. తాను కెప్టెన్ అయితే అందరినీ మార్చిపారదొబ్బుతా అని రేవంత్ అన్నాడు. ఈ మాటలను సుదీప గుర్తుచేశారు. ‘‘మార్చిపడేస్తా అన్నావుగా కిచెన్ టీమ్.. పాపం నీకు ఆ చాన్స్ రాలేదు. మార్చిపడదొబ్బుతా అన్నావ్’’ అంటూ నవ్వుతూనే రేవంత్‌కు చురకలంటించి వెళ్లిపోయారు సుదీప.