అలాంటి పాత్రలు రావడం నా అదృష్టం : తాప్సీ పన్ను

Share This :

‘ఝమ్మంది నాదం’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది తాప్సీ పన్ను. అనంతరం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అక్కడ సైతం మోస్ట్ వాంటెడ్ నటిగా మారిపోయింది. బీ టౌన్‌లో వరుసగా లేడి ఓరియెంటెడ్ సినిమాలు, నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ తాజా చిత్రం ‘లూప్ లపేటా’లో నటిస్తోంది. జర్మన్ సినిమా ‘రన్ లోలా రన్’కి రిమేక్‌గా వస్తున్న ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారంలోనే విడుదల కానుంది. అందుకే ఈ మూవీ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ.. ‘సినిమాలో ప్రధాన పాత్రలు చేయగలుగుతున్నందుకు సంతోషంగా ఉంది. పరిశ్రమలోనే బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ కథలు నా దగ్గరకు వస్తాయని నిస్సంకోచంగా చెప్పగలను. ఇలా చెప్పడానికి ఏ మాత్రం మొహమాటపడను. ఎంతో మంది రచయితలు నా దగ్గరకు వచ్చి ఈ కథను మీ కోసమే రాశామని చెబుతుండడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకే సినీ పరిశ్రమపై నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు’ అని చెప్పింది.
అంతేకాకుండా..‘నిజానికి సినిమా కథలు నా పాత్ర చుట్టే తిరగాలని నేను అనుకోవడం వల్ల ఇలాంటి కథలు చేయట్లేదు. అలా జరుగుతోంది అంతే. నా ప్రమేయం లేకుండా ఇలాంటి మూవీస్ చేయడాన్ని స్నో బాల్ ఎఫెక్ట్ అనొచ్చు. ఈ స్థాయిలో నాకెంతో సంతృప్తిగా అనిపిస్తోంది’ అని తెలిపింది. ప్రారంభంలో చేసిన ఓ ఏడు నిమిషాల పాత్ర వల్ల తన కెరీర్‌ ఇంత అద్భుతంగా మారిందని సంతోషం వ్యక్తం చేసింది.